Sunday, December 27, 2009


గురు సేవ


గురువు యొక్క అవశ్యకత ఏంతో అవసరమని సాక్షాత్తు పరబ్రహ్మ అయిన సాయినాథుడు చెప్పాడు. సాయినాథుడు సగుణాకృతిలో జీవించినంత కాలం మనకందరికీ తానే ఒక ఉదాహరణయి జీవించారు . సద్గురువులకే సద్గురువైన సాయినాథుడు తనకే గురువున్నారని,ఆయన పేరు "వెంకూసా" అని చెబుతూవుండేవారు .అంతెందుకు రామ,కృష్ణులకు వసిష్ఠుడు,సాందీపని గురువులనే విషయం అందరికి విదితమే.లోకోద్ధరణకై, దుష్టశిక్షణ శిష్ఠరక్షణకు వివిధావతారాలలో ఏతీంచిన అద్వైత శక్తికి గురువుయొక్క అవశ్యకత ఉన్నదా? తల్లి తన బిడ్డల కొరకై ఎన్నో త్యాగాలు చేస్తుంది. భగవంతుడు కూడా తల్లి లాంటివాడే .


అజ్ఞానాంధకారంలో కొట్టు మిట్టాడే మన లాంటి అజ్ఞానులకు గురువు యొక్క అవసరం ఎంతో ఉన్నది.మన జీవిత లక్ష్యమేమిటో మనకే తెలియదు. ఈ ఆధునిక యుగంలో ఆధునిక ఆడంబరాలకు చిక్కుకొని శలభాలవలె మాడిపోకుండా కాపాడగలిగే శక్తి కేవలం ఒక సద్గురువుకు మటుకేనున్నది.అటువంటి సద్గురువు దొరకాలంటే ఎంతో దుర్లభమైన విషయం .


ఆది శంకరాచార్యులు "భజ గోవిందం" లో వర్ణించిన జనన మరణ చక్రానికి బలికాకుండా శాశ్వతమైన మోక్షధామానికి చేరాలంటే సద్గురువు చెయ్యందించి నడిపించుకొని వెళ్ళాలే గాని మనంతట మనంగా చేరలేము. అణువణువున నిండుకొని సర్వత్ర వ్యాపించియున్నట్టి నిరంజనుడు నిరాకారుడైన పరబ్రహ్మ సగుణాకృతితో ప్రకటితమవ్వాలంటే అంత తేలిక కాదు. ప్రతియొక్కరి హృదయాలలోను జ్యోతిరూపంలో ప్రకాశిస్తూవుంటాడు. సద్గ్రంథ పఠనం,సద్భక్తుల సాహచర్యం,జప,ధ్యానాదులు ఈ ప్రకాశాన్ని గుర్తించటానికి ఎంతొ సహాయ పడతాయి.


నిష్కల్మషమైన అంతరంగశుద్ధితో సాయినాథుని సేవించుకోవాలి.మనసా,వాచా,కర్మణా ఆయన ఉనికిని గుర్తించి ,ఆయన మనకిచ్చిన కర్తవ్యాలను సక్రమముగా నెరవేరుస్తూ సాయినాథుడికి శరణాగతులమై శ్రీ నంజుండేశ్వర్ గారిచ్చినటుల ఖాళీ పేపరు ఆయనకి సమర్పించినచో సాయిసమర్థుడు తన భుజస్ఖందాలపై మనలను కూర్చోబెట్టుకొని ముందరకు మనజీవితలక్ష్యంవైపు తీసుకొని వెళతాడు. ఆ ప్రయాణం లో ఎన్నో వింతలూ,విడ్డూరాలు, ఒడిదుడుకులు చూస్తాం .


ఆ భాద్యతలన్నీ సాయినాథుడివే. ఒక్కొక్కప్పుడు మానవసహజమైన అహంకారంతో,అజ్ఞానంతో సాయినాథుడి వునికిని మర్చిపోయి బాధలకు లోనవుతాము. తన వునికిని గుర్తింపజేసి ఆ బాధలను నివారించగలిగేది సాయినాథుదు మటుకే.


సాయినాథుడిని సేవించుకోవటమంటే ఆయనకెంతో ఇష్టమైనది పరోపకారసేవ. ఎంతో మంది భక్తుల చేత ఎన్నోరకాల సేవలు చేయించారు . మనమనుకొని చేసే సేవ సేవకాదు. సాయినాథుడు మనకిచ్చిన శక్తితో వారి ప్రేరణతో చేయగలిగే సేవమటుకే మనకు సహాయ పడుతుంది. నిర్వికారంతోనూ నిరాపేక్షతోనూ చేసే సేవను ఆయన ఇష్టపడతారు. వారు చేయించే సేవ ఒకేవిధముగానుండదు. చేసేవారి మనస్తత్వావాలననుసరించి చేయిస్తారు. వారి శక్త్యానుసారం చెయిస్తారు.ఉదాహరణకు , శ్రీ రాముడు లంకాపట్టణానికి చేరేందుకు వారధి నిర్మించేడప్పుడు ఒక చిన్నారి ఉడుత కూడా తన శక్త్యానుసారం సహాయంచేసేందుకు ప్రయత్నిస్తుంది . శ్రీ రాముడు ముద్దుగా ఆ చిన్నారిని తన ఒడిలోనికి తీసుకొని లాలిస్తాడు. ఈ విషయం ప్రతియొక్కరికి తెలిసినదే .


అదేవిధంగా"సాయి అమృతధార"అనెడి వెబ్సైట్ ను చిరంజీవులు మునిరెడ్డి శ్రీకంఠ శర్మలతో తయారుచేయించి ,వారిచేత ఎంతో మందికి ప్రపంచవ్యాప్తంగా సేవ చేయిస్తున్నారు. సాయియొక్క ఈ అనుగ్రహం వారికి దొరకటానికి ఎన్నో జన్మలనుండి వారిరువు చేసుకొన్న సాయిసేవయే కారణం . వీరిద్దరూ సాయి,వారికి ప్రసాదించిన శక్తితో ఎంతో శ్రద్ధాభక్తులతో ,ఎటువంటి ఫలాపేక్షలేకుండా సాయిభక్తులందరికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యం తో ప్రపంచవ్యాప్తంగా నిర్మింపబడిన షిర్డీ సాయినాథుని ఆలయాలను, వాటి చిరునామాలను, షిర్డీక్షేత్రంగురించిన పూర్తివివరాలను,సాయి సహస్రనామం,సాయిలీలలు,సాయినాథుడికి


సంబంధించిన పుస్తకాలు,వాటి రచయితల పేర్లు మొదలైనవెన్నో ఈ వెబ్సైట్ లో పొందుపరిచారు.దీనిని తయారుచేసేందుకై వారిరువురు రెండు సంవత్సరాలనుండి నిరంతర కృషిచేసారు. ప్రతియొక్క షిర్డీసాయినాథుడి ఆలయంలో సంవత్సరం పొడుగునా జరిగే కార్యక్రమాలు మటుకే కాకుండా విశేష కార్యక్రమాలుకూడా ఈ వెబ్సైట్ ద్వారా ఎటువంటి ధనాపేక్షలేకుండా తెలియజేస్తున్నారు.ఇటివంటి అపారమైన సేవచెసే ఈ చిరంజీవులిద్దరికీ తమచేయూతనిచ్చి సహకరించవల్సిందిగా సాయిభక్తులైన సోదరసోదరీమణులను వేడుకుంటున్నాను. వెబ్సైట్లో లేని షిర్డీసాయినాథుని ఆలయాల చిరునామాలను ,ఆ ఆలయములలోని సాయినాథుడి ఫోటోలను, ఆలయంయొక్క వివరాలను తెలియజేయవల్సిందిగా కోరుతున్నాము.అంతే కాకుండా షిర్డీసాయినాథుడితో మీకు కలిగిన అనుభవాలను ఈ వెబ్సైట్ కు పంపిస్తే ,ప్రచురించబడతాయి.


చివరగా చి|| మునిరెడ్డి చి|| శ్రీకంఠశర్మలను,శ్రీ సాయినాథ పరబ్రహ్మ తన సంపూర్ణ కృపాకటాక్షాలతో ఆశీర్వదిస్తూ, వారు చేసే ఈ సేవాకార్యక్రమానికి అధిపతియై ,వారిరువురుకు తోడుగాఉండమైని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.


_ శ్ర్రీ సాయినాథార్పణమస్తు_


 


 


 


 

No comments:

Post a Comment